హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H-1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటూ అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి.ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు రావాలని ఆదేశించాయి. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం విదేశీ ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించాలని కోరాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా సంస్థలు అంతర్గత మెయిల్స్ పంపినట్లు తెలిసింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు 24 గంటల్లోపు అంటే సెప్టెంబర్ 21 లోపు ఆలస్యం చేయకుండా అమెరికాకు తిరిగి వచ్చేయాలని మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆదేశించాయి.
అమెరికా లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.


