భారత్‌తో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్థాన్, అగ్రరాజ్యం అమెరికా మధ్య స్నేహం బలపడుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూఎస్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు.
పాక్ ప్రధాని షరీఫ్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ సీనియర్ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.


