ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగింపుకు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించింది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాకుండా, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు హమాస్ కూడా ఈ ప్రణాళికను అంగీకరించాలని సూచించారు. లేదంటే ఆ ఉగ్ర సంస్థను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. శాంతి కోసమే ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అయితే, హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదన్నారు.


