జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లో తామే గెలుస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో 85 శాతం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన బాకీలను తమ ప్రభుత్వం కడుతోందని చెప్పుకొచ్చారు. మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతోందని ఎద్దేవా చేశారు. బాకీ కార్డు అని బీఆర్ఎస్ నాయకులు అంటుంటే జనాలు నవ్వుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడినట్లా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు చేస్తే ప్రజలు తిరుగబడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పదేళ్లు కాపురం చేశారని ఆక్షేపించారు. ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలని ప్రశ్నించారు.


