తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని గోపాల్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేర్చాడు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం, దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానం గవర్నర్ దగ్గరే పెండింగ్‌లో ఉండగా, ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు ప్రభుత్వమే జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు పది రోజులు ఆగాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.


