2025 సంవత్సరానికి గాను వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. మేరీ ఈ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, సిమోన్ సకాగుచి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీరం లోని రోగ నిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధించబడుతుందనే రహస్యాన్ని ఛేదించినందుకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది. వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెస్స్ అనే విధానంపై దృష్టి సారించాయి. దీని ద్వారా నియంత్రిత టి కణాలు ( రెగ్యులేటరీ టి సెల్స్) అని పిలిచే ప్రత్యేక రోగ నిరోధక కణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే సంరక్షకులుగా ఎలా పనిచేస్తాయో వారు ప్రపంచానికి తెలియజేశారు. మన రోగ నిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ వ్యవస్థను గుర్తించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు నోబెల్ అవార్డు కమిటీ ప్రకటించింది.


