యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సర్వే దేశవ్యాప్తంగా 2800 మంది అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం మారుతున్న జీవనశైలి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, జీఎస్టీ 2.0 వంటి ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చాయని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 41శాతం మంది రాబోయే మూడునాలుగు నెలల్లో కొత్తగా కారును కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లుగా చెప్పారు. 72శాతం మంది జీఎస్టీలో మార్పుల నేపథ్యంలో కార్ల కొనుగోలును వాయిదా వేసినట్లు చెప్పారు.
జీఎస్టీ సంస్కరణలతో వాహనాల ధరలు తగ్గాయని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలు కార్లను కొనుగోలు చేసే విధానాన్ని పూర్తిగా మార్చివేశాయన్నారు. 38 శాతం మంది వినియోగదారులు హైబ్రిడ్ కార్లను ఇష్టపడుతున్నారని, పెట్రోల్ కార్లు 30 శాతం మంది, ఎలక్ట్రిక్ కార్లకు 21శాతం మంది ప్రాధాన్యం ఇచ్చినట్లుగా సర్వే తెలిపింది. భారత్‌లో యూఎస్వీల ఆధిపత్యం కొనసాగిస్తుందని.. 64శాతం మంది యూఎస్వీలను కొనుగోలు చేయనున్నట్లుగా సర్వేలో చెప్పారు.


