తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025’ సదస్సులో ఆయనకు కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సు నవంబర్ 10 నుంచి 12 వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో జరుగనున్నది. శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, జీఈటీఎస్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్‌ఏ హిల్మీ కేటీఆర్‌కు ఆహ్వానాన్ని పంపారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.


