టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి సిరి (శిరీష లెల్లా) తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించడం వల్ల వివాహ వేడుకలు వాయిదా పడ్డాయి. ఇక రీసెంట్గా పెళ్లి తేదిని ఖరారు చేశారు. రోహిత్–శిరీష వివాహం అక్టోబర్ 30న హైదరాబాద్లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభలేఖ అందించారు. 30న జరగనున్న తన వివాహానికి ఆహ్వానించారు.
నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 25న హల్దీ వేడుకను, 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమాన్ని, 28న మెహందీ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నారు. చివరగా, అక్టోబర్ 30న రాత్రి 10.35 నిమిషాలకు ప్రధాన వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. నారా కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో, స్టార్ల హాజరుతో మరపురాని వేడుకగా మార్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు


