తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. ఈ యాత్రకు ముందుగా నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరిస్తూ, వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది ప్రాణ త్యాగం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఉద్యమకారులకు కొన్నిచోట్ల రాజకీయంగా నామమాత్రపు పదవులు దక్కాయి కానీ, వారికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. ఎంపి గా ఉన్నప్పుడు పార్టీ అంతర్గత వేదికలపై ఈ విషయం ప్రస్తావించినా, వారి కోసం గట్టిగా కొట్లాడలేకపోయాను. అందుకే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోతే రాబోయే ప్రభుత్వంతోనైనా ఇప్పించి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు.


