ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ప్లాంట్‌ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో కొంగరకలాన్ ప్లాంట్‌లో తమ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ నెలకు లక్ష ఎయిర్‌పాడ్‌లు ఉత్పత్తి అవుతుండగా, విస్తరణ పూర్తయ్యాక ఇది రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకల్లో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తుండగా, కంపెనీ మన రాష్ట్రంలో ఎయిర్‌పాడ్ లను ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 2 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ సంఖ్య 5 వేలకు చేరుకోనున్నారు. కీలక విడిభాగాల కొరత కారణంగా గత జూలై నెలలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ యూనిట్‌లో ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ ప్రొ 3 మాడల్స్‌తోపాటు ఫిట్‌నెస్ ఉత్పత్తులు, కనెక్టర్లు కూడా ఉత్పత్తి చేస్తున్నది. ఈ యూనిట్‌లో ఉత్పత్తైన వస్తువులను భారత్‌తోపాటు అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


