తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది.
హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను రేవంత్ కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. వీటితో టామ్‌కామ్ ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని జర్మన్ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు.


