అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది పాకిస్థాన్ అణు ఆశయాన్ని అడ్డుకునేందుకు భారత్-ఇజ్రాయెల్ కలిసి చేసిన రహస్య ప్రణాళికను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తిరస్కరించినట్లు చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఈ ఆపరేషన్‌ను తిరస్కరించడాన్ని ఆయన సిగ్గు చేటుగా అభివర్ణించారు.
పాక్‌లోని కహూతా అణుకేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్‌కు ఇందిర ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. 1980లో పాక్ రహస్య అణు కార్యకలాపాలను అభివృద్ధి చేస్తున్న సమయంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో బార్లో పనిచేశారు. అయితే, ఆసమయంలో ఈ ప్రణాళిక గురించి తాను విన్నట్లు బార్లో తెలిపారు. ఆసమయంలో నేను ప్రభుత్వ సర్వీసులో లేను. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఈ ఆపరేషన్ గురించి విన్నాను. అది కార్యరూపం దాల్చలేదు. ఇందిరా గాంధీ ఈ ప్రణాళికను అడ్డుకున్నారు. అలా చేయడం సిగ్గుచేటు. ఆ ఆపరేషన్‌ను ఆమోదించి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి అని ఆయన వివరించారు.


