ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, సెమీ హైస్పీడ్ రైళ్లను జాతికి అంకితం చేశారు. మూడు రైళ్లను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కొత్త రైళ్లు లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, వారణాసి-ఖజురహో, బెంగళూరు-ఎర్నాకుళం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ అందరికీ ప్రత్యేక అనుభవాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రయత్నంగా పేరొన్నారు. కాశీలో ఆరోగ్య సేవలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. పది పదకొండేళ్ల కిందట ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స పొందడం కష్టంగా ఉండేదని, ప్రజలకు ఒకే ఒక ఆప్షన్ ఉండేది అదే బీహెచ్‌యూ మాత్రమేనన్నారు. రాత్రంతా నిలబడినా బెడ్ పొందలేకపోయారని, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్య వచ్చినా చికిత్స పొందేందుకు ఇబ్బందులుపడేవారన్నారు. కాశీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం మహామన క్యాన్సర్ ఆసుపత్రితో సహా అనేక ఆసుపత్రులు నిర్మించిందన్నారు.


