వలసలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న అమెరికా సర్కారు రోజుకో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాజాగా వీసాలకు సంబంధించిన ఆరోగ్య నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. మధుమేహం, బీపీ, ఊబకాయం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసా తిరస్కరించేలా ట్రంప్ సర్కారు మార్గదర్శకాలు రూపొందించింది. అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ఈ నూతన మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంబసీలు, కాన్సులార్ కార్యాలయాలకు పంపించిందట. దీర్ఘకాలిక రోగాలు ఉన్న విదేశీయులను అమెరికా ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిగణించి వీసా తిరస్కరించాలని సూచించింది. వృద్ధాప్యం లేదా ఆరోగ్య కారణాల వల్ల అమెరికా ప్రభుత్వ వైద్య సాయంపై ఆధారపడే అవకాశం ఉన్న విదేశీయులను ఆ మేరకు వర్గీకరించాలని సూచించింది.
వాస్తవానికి ఆరోగ్యకారణాల రీత్యా వీసాను తిరస్కరించే నిబంధనలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ తాజా మార్గదర్శకాల కారణంగా అధికారుల విచక్షణాధికారాలు మరింత విస్తృతం అవుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం పడే అవకాశం ఉన్న సందర్భాల్లో వీసాను తిరస్కరించే అవకాశాలు పెరుగుతాయి.


