జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. పోలింగ్ రోజున ఎంతో అరాచకం సృష్టించారని తెలిపారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. నేను ఏం మాట్లాడినా, కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కౌంటింగ్ హాలులో ఆడవాళ్లపై కాంగ్రెస్ ర్యాగింగ్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఒక మహిళపై కాంగ్రెస్ నేతలు రౌడీ రాజకీయం చేశారని అన్నారు. ప్రజలను కాంగ్రెస్ భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు. నియోజకవర్గంలో షేక్ పేట, యూసప్ గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి, ఓటర్లను భయపెట్టి పోలింగ్‌ను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయం అని సునీత మండిపడ్డారు.


