జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. నియోజకవర్గ స్థానిక నాయకత్వం అద్భుతంగా కష్టపడిందని అన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని అన్నారు. ఆమెకు అభినందనలు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్‌ఎస్ గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టడంలో బలంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని అన్నారు. ప్రతి సర్వేలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని ఎలా చెప్పింది.. ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలు చూశారని అన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం బీఆర్ఎస్‌నే అని ప్రజలు స్పష్టం చేశారని తెలిపారు.


