స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. రూ.180.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రులు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును, డబుల్ రోడ్డుగా చేస్తామని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కాలేజీని, ప్రభుత్వ కాలేజీగా మార్చింది తామేనని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.


