ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ చట్టంలో నియామకాలు, సర్వీసు కండీషన్లు, పదవీకాలాలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గతంలో సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసిందని, చిన్నచిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తున్నాయని, అధికార వికేంద్రీకరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని, అలాంటి వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ చట్టాన్ని తాము సరిచూశామని, గతంలో కోర్టు రద్దు చేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ అమల్లోకి తెచ్చారని పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని స్పష్టంచేసింది.


