తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అంతకు ముందు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించామని అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తామన్నారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని మీరే బ్రాండ్ అంబాసిడర్‍గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు.


