ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలుకానున్నది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నవంబర్ 29న ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో నవంబర్ 27న ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేష్ జార్జ్ టోర్నమెంట్ తేదీలు, వేదికలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి దశ జనవరి 9 నుంచి జనవరి 17 వరకు నవీ ముంబయిలో జరుగుతుంది. రెండో దశ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5 వరకు వడోదర (బరోడా)లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వడోదరలోనే జరుగుతుంది.


