ఫ్రెంచ్ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన ఏ-320 సిరీస్‌లోని 6వేల విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద రీకాల్ కావడం విశేషం. ఈ నిర్ణయం విమానాయాన పరిశ్రమలో సంచలనంగా మారింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో విమానాలను గ్రౌండింగ్ చేయడం వల్ల విమానాల షెడ్యూల్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. దాంతో ప్రయాణికుల జేబులు, సమయంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నది. ఓ విమానం మెక్సికోలోని కాన్‌కూన్ నుంచి నూజెర్సీలోని న్యూవార్క్‌కు ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా విమానం వేగంగా కిందకు దిగింది.
ఆ తర్వాత విమానాన్ని ఫ్లోరిడాలోని టాంపాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఎయిర్‌బస్ A320 విమానాల్లో సాంకేతిక సమస్యపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మంచి పనితీరును కలిగిన ఉన్న ఎయిర్‌బస్ ఏ320 విమానాలు ప్రస్తుతం సాంకేతిక సమస్యల బారినపడ్డాయి. దీనిపై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది. A320 ఫ్యామిలీకి చెందిన విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్యను సృష్టించిందని గుర్తించారు. ఎక్కువ సోలార్ రేడియేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎలివేటర్ అండ్ ఎలిరాన్ కంప్యూటర్లలోకి వెళుతున్న డేటాలో తప్పుడు ఉన్నట్లు తేలింది. దాంతో తప్పుడు కమాండ్స్ విమానానికి వెళ్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్ ప్రస్తుతం 11,300 ఏ320 విమానాలను నడుపుతుంది.


