అమెరికాలోని బర్మింగ్‌హామ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోరమైన అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు తెలంగాణ విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. ఉన్నత విద్య అభ్యసించడం కోసం నాలుగేళ్ల క్రితం (2021లో) ఆమె అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్‌హామ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలిసింది.
సహజారెడ్డి స్వస్థలం మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, వెంకటాపూర్ గ్రామం. ఆమె తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందించారు. చదువు పూర్తి కావొచ్చిన సమయంలోనే ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకోవడంతో, ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రతిరోజూ తమ కుమార్తెతో వీడియో కాల్‌లో మాట్లాడేవారు, ఈ ఏడాది ఆమె ఇండియాకు వస్తుందని ఎదురుచూశారు. చివరికి తమ కుమార్తె మృతిచెందిందన్న వార్త విని గుండెలవిసేలా రోదించారు.


