చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప, ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై ప్రజలు నిరసనలతో స్వచ్చందంగా మద్దతు తెలిపారని అన్నారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని, అయితే వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది అని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుందని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చిందన్నారు. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే, వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు అని రోజా దుమ్మెత్తిపోశారు.


