అమెరికన్ టైకూన్, ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. వ్యక్తిగత సందప పరంగా మస్క్ ఏకంగా 600 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా ప్రపంచం లోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి పెరగడం విశేషం. వచ్చే ఏడాది స్పేస్ఎక్స్ పబ్లిక్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని రాయిటర్స్ గత వారం నివేదించిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్లో మస్క్‌కు దాదాపు 42 శాతం వాటా ఉంది. ఈ సంస్థ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా వృద్ధి చెందింది. ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి సోమవారం మధ్యాహ్నం సమయానికి మస్క్ నికర సంపద దాదాపు 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది అక్టోబరులో మస్క్ నికర సంపద 500 బిలియన్ డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. 2022లో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే దిగవుకు పడిపోయింది. ఆ తర్వాత మస్క్ సంపద పెరుగుతూ వస్తోంది. ఈ మూడేళ్లలోనే మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లు దాటడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు.


