తన దేశానికి వలసవచ్చిన పారిశ్రామికవేత్తలకు కొత్త వీసా కార్యక్రమాన్ని తయారు చేసేందుకు వీలుగా కెనడా తన బిజినెస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో కొంత భాగాన్ని నిలిపివేస్తోంది. స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులకు అందుబాటులో ఉన్న ఆప్షనల్ వర్క్ పర్మిట్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ఇమిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా(సీఆర్‌సీసీ) ప్రకటించింది. కెనడాలో ఇప్పటికే ఉండి ప్రస్తుత తమ స్టార్ట్-అప్ వీసా పర్మిట్‌ని పొడిగించుకునేందుకు చేస్తున్న దరఖాస్తులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఐఆర్‌సీసీ తెలిపింది. డిసెంబర్ 11వ నుంచి కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుల స్వీకరణను నిలిపేసినట్లు ఐఆర్‌సీసీ వెల్లడించింది.
అయితే ఇందులో కొంత మినహాయింపు ఉందని, 2025లో ఏదైనా సంస్థ నుంచి హామీ పొంది ఇంకా దరఖాస్తు చేయని వారు మాత్రం 2026 జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తమ స్టార్-అప్ వీసా ప్రోగ్రామ్‌ని పునఃసమీక్షిస్తున్నట్లు ఐఆర్‌సీసీ గత నెల తెలిపింది. స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్‌కు 2025లో ప్రాసెసింగ్ సమయం ఎక్కువగా ఉంది. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా మారేందుకు కొందరు పారిశ్రామికవేత్తలకు పదేండ్లకు పైగా సమయం పడుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఏండ్ల తరబడి ఎదురుచూపులతో విసిగిపోయిన పలువురు స్టార్ట్-అప్ ఫౌండర్లు కెనడాను వీడుతున్నారు.


