ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. స్థానిక భూమి ఉపరితలం నుంచి 100 మీటర్లు లేదా అంతకుమించి ఎత్తున ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడతాయని, అంతకన్నా తక్కువ ఎత్తున ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ గతనెల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. గత నెల ఇచ్చిన తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జె.కె. మహేశ్వరి, ఎ.జి. మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశాలను పరిశీలించడానికి కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు, ఈ అంశంపై సుమోటోగా దాఖలైన కేసుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆరావళి రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది.


