రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రజలకు 2026 సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యం చేరుకోవడం లో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని ఆకాంక్షించారు. 2025లో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాల్ని అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకుందని.. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నాంది పలికిందని గుర్తు చేశారు. ఇది ఒక సంవత్సరం కాదు.. నాటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు అని అభివర్ణించారు. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లను అధిగమించామని చెప్పారు. 2026లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగనుందన్నారు. ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని చెప్పారు.


