ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే కు ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. గత మూడేళ్లుగా తండ్రి కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో కిమ్ జు యే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జు యే తాజాగా మరోసారి బహిరంగంగా కనిపించారు. తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్‌సుసన్ స్మారకాన్ని ఆమె సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
2009లో రి సోల్ జుతో కిమ్‌కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే, ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు యే గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె అంటే కిమ్‌కు చాలా ఇష్టమట. 2022లో తొలిసారి జుయేని కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి తండ్రితోపాటూ పలు అధికారిక కార్యక్రమాల్లో జుయే మెరిశారు.


