తమిళ సూపర్ స్టార్, టీవీకేపార్టీ అధ్యక్షులు దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ A సర్టిఫికేట్ ఇవ్వాలని భావించింది. అయితే, సినిమా యూనిట్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాలోని అంశాలు సామాజిక స్పృహతో ఉన్నాయని పిల్లలు కూడా చూసేలా U/A ఇవ్వాలని కోరింది. ఈ కేసును నేడు విచారించిన న్యాయస్థానం సినిమాలోని సన్నివేశాలను పరిశీలించిన తర్వాత, చిత్రంలో ఎక్కడా మితిమీరిన హింస కానీ అభ్యంతరకర అంశాలు కానీ లేవని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే ధోరణిని సినిమాలో చూపించారని పేర్కొంటూ తక్షణమే U/A సర్టిఫికేట్ జారీ చేయాలని స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


