ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు. ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై తదుపరి చర్యలు నేటి నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారని కూడా సెర్గియో తెలిపారు. ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహం స్వచ్ఛమైందని, ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని వారు పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.


