స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై గత ఏడాది ఆలోచన పుట్టింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లో గాజా యుద్ధం కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఆయన క్రియేట్ చేశారు. అయితే ఆ ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికకు యూఎన్ అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. గాజా నుంచి మిలిటరీని వెనక్కి పంపేందుకు, ఆ పట్టణాన్ని మళ్లీ పునర్ నిర్మించేందుకు బోర్డ్ ఆఫ్ పీస్ అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్‌ను అంతర్జాతీయ సంస్థగా గుర్తిస్తున్నారు. సంక్షోభ ప్రదేశాల్లో స్థిరత్వం, శాంతి, సుపరిపాలన లక్ష్యంగా ఆ బోర్డును ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ బోర్డుకు నిరవధిక చైర్మెన్‌గా ట్రంప్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆ బోర్డు క్రియేట్ చేసుకున్న తీర్మానం ప్రకారం ఆయన చాన్నాళ్లు ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్‌లో అల్లుడు జేర్డ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఉండనున్నారు.


