దేశ భక్తి లేని వారు, ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 25 ఏళ్లు అయిన సందర్భంగా స్మరణ, నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు. సమాజాన్ని చెడగొట్టేలా ఉగ్రవాద ప్రసంగాలు చెబితే, వారు ప్రజా ద్రోహులేనని విమర్శలు చేశారు. దేశభక్తి అంటే, ఎవడి పని వాడు చేస్తే చాలని చెప్పానని ప్రస్తావించారు. దేశంలో కష్టపడి పని చేసేవారి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. తెలివి తేటలతో బాగా పని చేస్తే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన విధంగా 2047 నాటికి దేశం ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంటుందని వెల్లడించారు. సత్య నాదెళ్ల వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంచుకున్న పనుల్లో ఎదిగేలా యువత కష్టపడి పని చేయాలని దిశానిర్దేశం చేశారు.


