భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతుల నుంచి మత్స్యకారుల వరకూ దేశంలోని 140 కోట్ల మందికి ప్రయోజనకారిగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీంతో ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాతో పీయూష్ గోయల్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఆ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ ధ్రువీకరించడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. పార్లమెంటులో ఈ (ట్రేడ్ డీల్) వివరాలను పంచుకోవాలని తాను అనుకున్నానని, అయితే లోక్‌సభలో ఈరోజు ఎంత రభస జరిగిందో అందరూ చూశారని గోయల్ అన్నారు. సభలో జరిగిన దానికి రాహుల్ గాంధీని ఆయన తప్పుపట్టారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అముద్రిత పుస్తకం నుంచి విపక్ష నేత కొన్ని అంశాలను ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నమే ఈ రభసకు కారణమని అన్నారు.


