వైసిపి పాలనలో చాలా సంఘటనలు జరిగాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని సూచించారు.ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే, ఇవి పోతే ఇంకోటి కొందామని మాట్లాడారని, అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివాడు చేశారని చెప్పారని అన్నారు. తాను, సిఎం చంద్రబాబు నాయుడు చాలా అప్రమత్తంగా మాట్లాడతామని, ఎన్ డిడిబి నివేదికను సిఎం వినిపించారని తెలియజేశారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశం అని, ఐదేళ్లు తమకు అవకాశం ఉన్నప్పుడు, వచ్చిన 2 నెలల్లోనే అసత్యాలు చెబుతామా? అని ప్రశ్నించారు.కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని చెప్పాల్సి వచ్చిందని మండిపడ్డారు. సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. వీళ్లేమో భగవంతుడిపైనా పగ పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. నెయ్యిలో కల్తీ లేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందని, ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా, వాస్తవాలు చూసుకోరా? అని ప్రశ్నించారు. ఈ అంశం ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు..కేవలం హిందువులదేనని చెప్పారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


