పరీక్షలు పండుగల లాంటివని, వాటిని భారంగా భావించవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. కేవలం మార్కులపైన మాత్రమే దృష్టిపెట్టి చదవద్దని, జీవితాన్ని మెరుగుపర్చుకో వడం కోసం చదవాలని సూచించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని మోదీ వారితో ఇంటరాక్ట్ అయ్యారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు.కంఫర్ట్‌గా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదని విద్యార్థులకు ప్రధాని సూచించారు. కంఫర్ట్ జోన్స్ జీవితాన్ని తీర్చిదిద్దలేవని చెప్పారు. అందరి సలహాలు తీసుకోవాలని, కానీ మీకు నచ్చిన విధంగా మీ జీవన విధానాన్ని మలుచుకోవాలని ప్రధాని సూచించారు. ముక్కలు ముక్కలుగా చదివే చదువు విజయాన్ని అందించదని ప్రధాని చెప్పారు. మీ పేరెంట్స్, టీచర్స్, తోటి విద్యార్థులు ఏమంటున్నారనేది విషయం కాదని, వారి సూచనలు మనుసులో పెట్టుకుని మీకు నచ్చిన దారిలో నడవాలని అన్నారు.


