ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో మోదీ మలేసియా చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. రాజధాని కౌలాలంపూర్‌లో చిన్నారులు రెండు దేశాల జాతీయ పతాకాలు చేతపట్టుకోగా, మలేసియా ప్రధానితోపాటు ఇరు దేశాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఒకే కారులో మోదీ, అన్వర్ హోటల్‌కు చేరుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ అక్కడ పర్యటించడం ఇది మూడోసారి. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడంతోపాటు, కీలక అంశాల్లో సహకారం దిశగా ఒప్పందాలు జరగనున్నాయి. రక్షణ, భద్రత, ఆర్థిక పరమైన అంశాలపై మోదీ, అన్వర్ చర్చిస్తారు. మలేసియా ప్రధాని ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపడుతున్నట్లు మోదీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలోపేతం అవుతున్నాయని, ఈ పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేస్తుందని భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.


