సుప్రీం కోర్టులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కుంభకోణంలో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. సుమారు రూ.750 కోట్ల కుంభకోణంలో 9 నెలలుగా జైల్లో ఉండటం పెద్ద సమయమేమీ కాదని అన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారు కసిరెడ్డి అని తెలుస్తోందని తెలిపారు. రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీతో కసిరెడ్డి నేరుగా సంబంధాలున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే తమ వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కసిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వచ్చే గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది.


