వాట్సాప్ తన వెబ్ వెర్షన్ లో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. కొత్తగా వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. దాంతో యూజర్లు ఎలాంటి అదనపు సాఫ్ట్వేర్ ఉపయోగించకుండానే నేరుగా వెబ్ నుంచే ఆడియో/ వీడియో కాల్స్ చేయవచ్చు. యూజర్ల వ్యక్తిగత చాట్ విండోలో కాల్ బటన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. వాట్సాప్‌లో ప్రస్తుతం ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడాలంటే మొబైల్ యాప్ ఉండాలి. ల్యాప్‌టాప్/ పీసీలపై పనిచేసే వారైతే వాట్సాప్ విండోస్ లేదా మ్యాక్ వెర్షన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ వెబ్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నది. ఎవరికైనా కాల్ చేయాల్సి వస్తే ఎలాంటి యాప్ డౌన్లోడ్ అవసరం లేకుండా ఇకపై నేరుగా కాల్స్ చేయవచ్చు. పరిమిత సంఖ్యలో యూజర్లకు తీసుకొచ్చిన ఈ సదుపాయం త్వరలో అందరికీ రానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాదిరిగా వాట్సప్ వెబ్ నుంచి చేసే కాల్స్‌కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది.


