ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ లో రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను చట్టవిరుద్ధంగా ప్రస్తావించారని కంగనా ఆరోపించారు. రాహుల్ గాంధీ నిన్న ఒక అనధికారిక, చట్టవిరుద్ధమైన పుస్తకాన్ని సభకు తీసుకొచ్చి మొత్తం న్యాయవ్యవస్థను అవమానించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ కూడా స్పష్టంచేసింది అని అన్నారు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.


