భారత వాయుసేనకు మరింత బలం చేకూరేలా కేంద్రం అడుగు వేస్తోంది. ఈ మేరకు రఫేల్ యుద్ధ జెట్లకు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ విమానాలను కేంద్రం కొనుగోలు చేయనుంది. భారత రక్షణ చరిత్రలోనే అతి పెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డీల్‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ 114లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు భారత వాయు సేనలో విధులు నిర్వర్తించనున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లీ వంటి వాటి కోసం ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, భారత్‌లోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి.


