దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్నదని పేర్కొన్నది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే మహ్మద్ తదితర ఉగ్ర ముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలంగా నేర కార్యకలాపా లు సాగిస్తున్నాయని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ఆంక్షలు ఉన్నప్పటికీ జైషే ముఠా పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు తెలుస్తున్నది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి అందులో ఒకటని ఒక సభ్యదేశం ఆరోపించింది. అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే కొత్త పన్నాగాలు పన్నుతోంది. గత ఏడాది జమాత్ ఉల్ ముమినత్ పేరుతో మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’ అని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొన్నది.


