ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలకడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు విశేషమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యానికి చూపుతున్న నిబద్ధతను పవన్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. విద్యారంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఆధారిత విద్య, డిజిటల్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన వంటి విధానాలు విద్యార్థుల నైపుణ్యాలను పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించబోతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించడం, టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య సేవలను అందించడం వంటి అంశాల్లో భాగస్వామ్యం కీలకమని అన్నారు.


