గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో మంత్రి నారా లోకేశ్‌తో సహా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి పంపించి స్వాగతం పలికారు. సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటూ ముఖ్యమంత్రిని పలకరించారు గేట్స్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సహా ఇతర క్యాబినెట్ మంత్రులను బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు పరిచయం చేశారు.
ఆర్టీజీ సెంటర్‌కు గేట్స్‌ను తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. తర్వాత ఆ విభాగం పనితీరును వివరించారు. పాలనా వ్యవహరాలు, విపత్తుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనే అంశాన్ని ఉదాహరణలతో సహా వివరించారు ముఖ్యమంత్రి. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రి వివరించగా, దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు బిల్ గేట్స్. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై గ్రేట్ అంటూ గేట్స్ అభినందనలు తెలిపారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడంపై బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు.


