పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్ కేసు వేసింది.మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణకు రాహుల్‌గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ, అప్పట్లో సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదుచేశారు. ఆ కేసు విచారణలో ఇప్పుడు రాహుల్‌గాంధీకి బెయిల్ మంజూరయ్యింది.


