తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నియామకపత్రం అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి నరేందర్ రెడ్డి ధన్యావాదాలు తెలిపారు. తాను ఎంపీ కావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సాయన్న నామినేషన్ వేశారు. నిబంధన ప్రకారం పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో స్క్రూటినీ దశలోనే సాయన్న నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఇద్దరు ఏకగ్రీవం కావడానికి మార్గం మరింత సుగమం అయింది. అభిషేక్ మను సింఘ్వీ దేశంలో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఏఐసీసీ కోటా కింద తెలంగాణ నుంచి మరొకసారి ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. వేం నరేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవి రావడానికి ముఖ్యమంత్రే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


