హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటింది. కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో 125 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా తన ఉనికిని చాటుకున్నది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించారు. కాగా, జనవరి 3 నుంచి 13 వరకు ఇద్దరు సోదరులు కలిసి ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, నాగ్‌పూర్, ముంబై అంతటా 12కు పైగా బహిరంగ సభల్లో ప్రసంగించారు. వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలను అసదుద్దీన్ ఒవైసీ బలంగా లేవనెత్తారు. మౌలిక సదుపాయాలు, తాగు నీరు, పారిశుధ్యం, పౌర సేవా లోపాలను ఎత్తిచూపారు. ఈ సమస్యల పరిష్కారంపై ఓటర్లకు హామీ ఇచ్చారు.


