తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఘోరీ కట్టారని దెప్పిపొడిచారు. ఈ బడ్జెట్‌ను చూస్తే ఎన్నికల హామీలపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమైందని అన్నారు. ఈ బడ్జెట్లో గతం కంటే 20పేజీలు పెంచారు తప్ప, హామీలకు కేటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని ధ్వజమెత్తారు.
సీఎం ప్రజలకే కాదని, ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 3లక్షల పింఛన్లు కట్ చేసి, 2లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారని అన్నారు. కోటీశ్వరులు సంగతి అటుంచి, మొదట మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్, ఇందిరమ్మ పేర్లతో అమలవుతోన్న స్కీంలకు సైతం కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ది, అభయ హస్తం కాదని, రిక్త హస్తమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది మూడు ముక్కలాట తప్ప, విజన్ లేదని దెప్పిపొడిచారు. బడ్జెట్లో అన్నివర్గాలకు మొండి చెయ్యి చూపారని ఆగ్రహించారు. మూడున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి, రేవంత్ చేసిందేమీ లేదని విమర్శించారు.


