మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ అధిష్ఠానం. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆదేశించింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది.


