దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా తొలి ముద్ద పథకాన్ని సిఎం ప్రారంభించారు. రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని తెలిపారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని, పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని, అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు.


